మహానంది చరిత్ర - History of Mahanandi

 

మహానంది  ఒక ప్రముఖ శైవక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల కు 14 కిలోమీటర్ల దూరంలో మహానంది గ్రామంలో ఈ మహానంది క్షేత్రం ఉంది.

మహానందిలో ఉన్న స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్దంలో కట్టించారు. ఇక్కడ ఉన్న ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయ పాలనా కాలం (680-696) నాటిదని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా తప్పటగ ఉంటుంది. పుట్టలో ఉన్న స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపం తెచ్చుకున్న ఆవు యొక్క యజమాని ఆవుని కొట్టగా పుట్టలో అన్న స్వామి వారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. మహానంది లో కనిపించే మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రవహించే నీరు శుద్ధ స్పటిక వర్ణంలో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటిలో చిన్న నాణెం వేసినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నీటిపై కదలికలు లేనట్లయితే అసలు అక్కడ నీరు ఉన్నట్లు కూడా మనకు తెలిసి రాదు. దీన్ని బట్టి మన అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నీరు ఎంత తేటతెల్లంగా ఉంటాయో. ఈ నీటిలో చిన్న సూది వేసినా కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉండే శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వాన కాలంలో మలినాలు లేకుండా తేటగా ఈ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉంది. ఈ నీటిని తీర్థంగా అక్కడికి వచ్చే భక్తులు తీసుకు వెళుతుంటారు. మహానంది క్షేత్రంలో ఊరే ఈ నీరు సుమారు 3 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇచ్చట బ్రహ్మ విష్ణు రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోద్భవ సమయమున అభిషేకము, కళ్యాణోత్సవము రధోత్సవములు జరుగుతాయి.

మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కలిపి నవనందులు అని పిలుస్తారు.

మహానంది క్షేత్రం ఎలా ఏర్పడింది?


పూర్వీకులు తెలిపిన కథ ప్రకారం... ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకునే కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలా భక్షకుడై ఎల్లప్పుడూ తప్పు ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయనను అంతా శిలాదుడు అంటే శిలాదమహర్షి అని పిలిచేవారు. అతని భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడు గురించి అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చి మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. కొన్ని సంవత్సరాల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై.. కావాల్సిన వరాలు కోరుకోమన్నాడు. దేవాది దేవునికి చూసిన పారవశ్యంలో శిలాజ మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షను గుర్తించుకొని.. మీ దంపతుల కోరిక సిద్ధించు గాక అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలా దేవుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కటోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు.. దేవాదిదేవా.. నేను నీ వాహనంగా చేసుకో.. అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహిని గా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి  చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందులలో లింగరూపుడై  ఉంటానని వరం అనుగ్రహించాడు.

మహానంది క్షేత్రం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఆ కథను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం...

ఈ క్షేత్రం లో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టిన రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువుల కాపరి ఒకరోజు అని దీనిని చూశాడు. పుట్ట కింద బాల శివుడు నోరు తెరిచి ఈ పాలు రోజూ తాగుతూ ఉండేవాడు. ఈ దృశ్యం చూసిన ఆ గొల్లవాడు పెద్ద నందునితో చెప్పాడు. నందుడు వచ్చి ఈ దృశ్యాన్ని చూశాడు. దృశ్యం కంటపడింది. గోవు భయపడింది. అది పుట్టని తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రలు గా పడ్డాయి. ఇవాల్టికి కూడా ఆ ముద్రలను మనం చూడవచ్చు. నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవం అయినటువంటి నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శివాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది. దాని ఎదుట చక్కని పుష్కరిణి ఉంది. ఈ రెండింటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్ధము అనే పేరు వచ్చింది.

 నవనందులు - దర్శనం


కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాలువ గట్టున ప్రధమ నందీశ్వరాలయం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగ నందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమ నందీశ్వరుడు, బండి ఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివ నందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానంది కి వెళ్ళే దారిలో కుడివైపున తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వరాలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయం కొలువై ఉన్నాయి.

ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలు తెలుసుకోవాలంటే ప్రతిరోజు 7tvnews.in అనుసరించండి.

Post a Comment

Previous Post Next Post