మానవ ధర్మం - తెలుగు కథ
బాల్య మిత్రులు అయిన శరభయ్య, చలమయ్య పార్వతీపురం జమీందారు దివాణంలో ఉద్యోగాలు చేస్తుడేవారు. వాళ్ళిద్దరూ ఒకే వయసు గల స్నేహితులు కావడంతో ఇద్దరికీ ఒకే ఏడాది పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పుడు వారి ఇద్దరి కొడుకులు ఒకే తరగతి చదివే విద్యార్థులుగా ఉంటూ స్నేహితులయ్యారు.
ఒకరోజు చలమయ్య దివాణంలో పని ముగించుకుని ఇంటికి వచ్చేసరకి కొడుకు సాంబడు మారాం చేస్తూ కనిపించాడు.
రేపు తన పుట్టినరోజు సందర్భంగా తరగతిలో పిల్లలందరికీ మిఠాయి పంచుతానని అవి కొనే నిమిత్తం డబ్బులు కావాలని తల్లిని సతాయించడం చలమయ్య చెవిన పడింది.
'పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడానికి మనమేమి కోటీశ్వరులమనుకున్నవా? లక్షాధికార్లమనుకొన్నావా? నీకు ఏది తినాలనిపిస్తే అది అమ్మ చేత వడ్డించుకుని తిను చాలు,' చిరాకు పడుతూ చెప్పాడు చలమయ్య.
'మొన్న నీ బాల్యమత్రుడు అయిన శరభయ్య కొడుకు సుబ్బరాజు తరగతిలో అందరికీ మిఠాయిలు పంచి పుట్టినరోజు జరుపుకున్నాడు. వాళ్లు ఏమైనా ధనవంతులా?' ఎదురు ప్రశ్న వేశాడు సాంబడు.
కొడుకుతో వాదనకు దిగి లాభం లేదని గ్రహించిన చలమయ్య 'అందరికీ మిఠాయిలు పంచి డబ్బును వృధా చేయడం కన్నా దాంతో నీకు నచ్చిన ఆటబొమ్మ కొంటాను,'అని ఆశ కల్పించి చెప్పాడు.
ఇదేదో బాగున్నట్లుంది అనుకుని ఒప్పుకున్నాడు సాంబుడు. అనంతరం తండ్రి తో పాటుగా అంగడికి వెళ్లి నచ్చిన బొమ్మ కొనిపించాడు సాంబడు.
రోజులు గడుస్తున్న కొలది సుబ్బరాజు తరగతి గదిలో తోటి పిల్లలకు సాయపడే తీరు ఇంటిదగ్గర తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు చెబుతూ తాను కూడా తోటి పిల్లలకు ఏదో ఒక సాయం చేస్తానని దానికి డబ్బులు కావాలని మొండిపట్టు పట్టేవడు సాంబడు.
సాంబడి మనసు మార్చడానికి చాలామంది తల ప్రాణం తోకకు వచ్చేటట్టు ఉండేది. అయినా ఏదో ఒక రూపంలో కొడుక్కి బహుమతులు ఇస్తూ అదుపులో పెడుతూ ఉండేవాడు.
సుబ్బరాజు కారణంగా తన కొడుకు పెడుతున్న ఇబ్బందులను ఒకసారి శరబయ్యతో ప్రస్తావించాడు చలమయ్య.
'శరబాయ్యా! నీ కొడుకు అందరికీ భిన్నంగా ఉండాలని మిగతా పిల్లలకు ఏదో ఒక సహాయం చేస్తూ గొప్పలకు పోతున్నాడట. ఇది అలవాటు అయితే నీ ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోగలదు. ఇంతకీ నీకు తెలిసే ఈ పనిచేస్తున్నాడా? అంటూ అనుమానం వ్యక్తం చేశాడు చలమయ్య.
'చేతనైనంత సాయం చేయమని నేనే చెప్పాను. స్వార్థం నేర్పితే తప్పు కాని, సాయపడు అని చెప్పడంలో తప్పులేదు కదా! ఉన్నంతలో ఇతరులకు సాయపడడం కూడా మానవధర్మమే,'అన్నాడు శరభయ్య.
ఎవరి వెరీ వారికి ఆనందం అనుకున్న చలమయ్య, నీతులు చెప్పిన శరభయ్యపై మాత్రం దేశం పెంచుకున్నాడు. అప్పటినుండి శరభయ్యతో మాటలు కూడా తగ్గించుకున్నాడు. సుబ్బరాజు తో స్నేహం వీడమని సాంబడికి చెప్పాడు కూడా.
పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. చదువు పూర్తి చేసుకున్న సుబ్బరాజుకి దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది. వృద్ధాప్యం దగ్గర పడటంతో శరభయ్య కూడా ఆ ఊరు విడిచి సుబ్బరాజుతో పాటు వెళ్ళిపోయాడు.
సంవత్సరాలు గడిచాయి. సుబ్బరాజు తన సంపాదనలో కొంత భాగాన్ని మంచి కార్యాలకు వినియోగించడానికి మొదటి నుంచి దాచి ఉంచడం అలవాటు చేసుకున్నాడు.
తను పుట్టి పెరిగిన ఊరిలో వృద్ధాశ్రమం గురించి జనం చెప్పుకోవడం సుబ్బరాజు చెవిన పడింది.
దాచి ఉంచిన డబ్బును తండ్రి చేతులమీదుగా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు.
శరభయ్య ఎంతగానో సంతోషించాడు. కన్నతల్లిలా పెంచి పెద్ద చేసిన ఊరికి సాయపడటం అంటే కన్న తల్లి రుణం తీర్చుకున్న అంత తృప్తి కలుగుతుందని కొడుకుతో అన్నాడు.
అనుకున్నదే తడవు సుబ్బరాజు, శరభయ్య తాము పుట్టిన ఊరు చేరుకున్నారు. అక్కడి ఆశ్రమంలో అడుగుపెట్టాక ఆకర్షణీయంగా పూలతోట కనిపించింది. మరోప్రక్క ఉన్న పండ్ల తోటలో కొందరు వృద్ధులు కలిసి తోట పని చేస్తూ కనిపించారు.
శరభయ్య కు పూలతోటవైపు వెళ్ళాలనిపించింది. కొడుకును ఆశ్రమ నిర్వాహకులను కలవమని చెప్పి తానొక్కడే పూల తోటలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక వృద్ధుడు మొక్కలకు నీరు పోస్తూ విరబూసిన పూలను నిదానంగా ఏరి సజ్జలో వేస్తున్నాడు.
ఆ వయసులో వృద్ధుని శ్రద్ధ చూశాక అభినందించాలని అనుకుని 'ఇంత మమకారంతో పిల్లల్ని సాకినట్లు మొక్కల బాగోగులు చూస్తున్నావు. నువ్వు చేస్తున్న సేవ సర్వమానవాళికి చేస్తున్న సేవ వంటిదే. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మేలు చేస్తాడు,'అంటూ పలకరింపుగా మాట్లాడాడు.
గతంలో పరిచయమైన గొంతు వినిపించడంతో తల ఎత్తి చూశాడు ఆ వృద్ధుడు. అతడిని చూడగానే శరభయ్య ఆశ్చర్యపోయాడు.
'చలమయ్యా నువ్వా! అంటూ ఆ వృద్ధుడు నీ పరమానందంతో రెండు చేతులతో ఆలింగనం చేసుకున్నాడు శరభయ్య.
చలమయ్య కూడా అంతే ఆప్యాయంతో ఒదిగిపోయాడు. ఒకరికి ఒకరు కుశలప్రశ్నలు వేసుకుంటూ సమీపంలో చెట్టునీడన చేరారు.
'నువ్వేంటి ఇలా వచ్చావు?'శరభయ్యని అడిగాడు చలమయ్య. శరభయ్య తను వచ్చిన పనిని చెప్పాడు.
'ఒక దాత వస్తున్నాడు, పూలదండ చేయమని నిర్వాహకులు ఈ ఉదయం చెపితే ఎవరికో అనుకున్నాను. నేను పెంచిన తోట నుండి తయారైన దండ ఇవాళ ఒక నిజమైన అతుడికి చేరడం నాకెంతో సంతోషంగా ఉంది.'ఆనంద పడుతూ చెప్పాడు చలమయ్య.
'ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు. కాలక్షేపం కోసం నువ్వు ఎంచుకునే మార్గం బాగుంది. ఇటు వృద్ధులకు సేవ, అటు పూలతోట పెంపకం,' అన్నాడు శరభయ్య.
'నీ మాటలే నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నాయి. గతంలో మనకు ఉన్న దానిలో సాయం చేయడం మానవ ధర్మం అని చెప్పావుగా! అదే ఆచరిస్తున్నాను ఇప్పుడు నాకు మిగిలింది ఈ శరీరం మాత్రమే గదా! బొంగురుపోయిన గొంతుతో చెప్పాడు చలమయ్య.
'నీ కుటుంబం ఎక్కడ?' ఓదార్పుగా అడిగాడు శరభయ్య.
'ఏ కొడుకు అయితే సుఖంగా ఉండాలని ఆశించే స్వార్థం నేర్పానో ఆ స్వార్థమే వాడిలో స్థిరపడిన నాకు, నా భార్యకు ఈ వృద్ధాప్యంలో తిండి పెట్టడమే దండగనే భావనను పుట్టించింది.
చివరకు ఇంటి నుండి బయటకు పంపించేశాడు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనాలోచిత నిర్ణయాలు ఇలాంటి అనర్ధాలకు కారణమని తెలుసుకోవడానికి ఇంత కాలం పట్టింది. సాయపడే బుద్ధిని నేర్పించిన నీ పెంపకం నిన్ను ఉన్నతస్థాయిలో ఉంచింది. నీ పెంపకం వలన ఇప్పుడు నా లాంటి వాళ్లకు ఇంత తిండి దొరుకుతోంది.'అంటూ వలవల ఏడ్చాడు చలమయ్య.
'కష్టాలు కొద్దికాలమే ఉంటాయి. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి', ఆత్మీయంగా పిలిచాడు శరభయ్య.
మానవ ధర్మం పాటించేందుకు ఇక్కడే ఉండిపోతాను. అప్పుడప్పుడు చూసిపో,'అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలమయ్య.
7tvnews.in
Post a Comment